పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/254

ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0154-02 శంకరాభరణం సం: 02-253 అద్వైతము

పల్లవి: ఏకాత్మవాదులాల యిందు కేది వుత్తరము
మీకు లోకవిరోధ మేమిటఁ బాసీనయ్యలాల

చ. 1: పాప మొక్కడు సేసితే పాపులే యిందరుఁ గావలదా
యేపున వొకరిపుణ్య మిందరికి రావలదా
కోపంచి యొక్కఁ డసురైతే కోరి యిందరుఁ గావలదా
చూప దేవుఁడొక్కఁడైతే సురలిందరుఁ గావలదా

చ. 2: వొకఁ డపవిత్రుఁ డైతే నొగి నిందరుఁ గావలదా
వొకఁడు శుచై వుండితే వోడ కిందరుఁ గావలదా
వొకని రతిసుఖమంటి యిందరును వొనరఁ బొందవలదా
వొకని దుఃఖ మందరు వూరఁ బంచుకోవలదా

చ. 3: ఆకడ నొకఁడు ముక్తుఁడయితే నందరునుఁ గావలదా
దీకొని యొకఁడు బంధుఁడయితే యిందరుఁ గావలదా
చేకొని శ్రీవేంకటేశుఁ జేరి దాసులయి యుండేటి-
లోకపు మునులనుఁ దెలుసుకోవలదా