పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/227

ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0149-04 శంకరాభరణం సం: 02-226 రామ

పల్లవి: శరణన్న విభీషుణుఁ గరుణఁ గాచినవాఁడు
పరికింపఁ దారకబ్రహ్మమా యీరాముఁడు

చ. 1: ఆలికై విల్లువిఱిచి వాలికై యమ్మువేసిన-
వాలుమగఁటిమిగలవాఁడా వీఁడు
ఱాలను జలధిగట్టి కేలను మోక్షమిచ్చి
యేలేను జటాయువును యీతఁడా రాముఁడు

చ. 2: మింటికట్లు దెగనేసి యంటి పగసాధించి
దంటరాకుమారుఁడు తా నీశూరుఁడా
బంటుగా వాయుజు నేలి నంటు సుగ్రీవుతోఁ జేసి
కంటకరావణవైరి ఘనుఁడా యీరాముఁడు

చ. 3: రాకాసుల మర్దించి కాకాసురు నటు గాచి
మైకొన్న జానకీరమణుఁ డితఁడా
యీకడ శ్రీవేంకటాద్రి నిరవై తాను నున్నాఁడు
దీకొన్న ప్రతాపపుఁ దేవుఁడా యీరాముఁడు