పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/224

ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0149-01 శంకరాభరణం సం: 02-223 హనుమ

పల్లవి: మతంగపర్వతమాడ మాల్యవంతము నీడ
అతిశయిల్లిన పెద్ద హనుమంతుఁడితఁడా

చ. 1: యీతఁడా రామునిబంటు యీతఁడా వాయుసుతుఁడు
ఆతతబలాఢ్యుఁడందు రాతఁడితఁడా
సీతను వెదకివచ్చి చెప్పిన యాతఁడితఁడా
ఘాతల లంకలోని రాక్షసవైరి యితఁడా

చ. 2: అంజనాసుతుఁ డితఁడా అక్షమర్దనుఁ డితఁడా
సంజీవనికొండ దెచ్చె సారె నితఁడా
భంజించెఁ గాలనేమిని పంతమున నితఁడా
రంజితప్రతాప కపిరాజసఖుఁ డితఁడా

చ. 3: చిరజీవి యీతఁడా జితేంద్రియుఁ డితఁడా
సురల కుపకారపుచుట్ట మీతఁడా
నిరతి శ్రీవేంకటాద్రిని విజనగరములో-
నరిది వరములిచ్చీ నందరికి నితఁడా