పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/217

ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0147-06 మాళవి సం: 02-216 హనుమ

పల్లవి: కలశాపురముకాడఁ గాచుకున్నాఁడు
వలసిన వరాలిచ్చీ వాయునందనుఁడు

చ. 1: మాయాబిలము చొచ్చి మగుడి యంబుధిలోని-
చాయాగ్రహముఁ జంపి చయ్యన దాఁటి
ఆయెడ లంకిణిఁ గొట్టి యంతలో జానకిఁగని
వాయువేగాన వచ్చిన వాయునందనుఁడు

చ. 2: కడలిదరినుండిన కపులతోఁ గూడికొని
వడదీరఁగా మధువనము చొచ్చి
బడి రామునికి సీతాపరిణామ మెల్లాఁ జెప్పె
వడిగలవాఁడితఁడు వాయునందనుఁడు

చ. 3: రావణాదిరాక్షసుల రామునిచే సాధింపించి
ఆవిభుని సీతఁ గూర్చి అయోధ్య నుంచె
శ్రీవేంకటేశుఁ గొల్చి శిష్టరక్షణమునకై
వావిరి నిలుచున్నాఁడు వాయునందనుఁడు