పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/216

ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0147-05 రామక్రియ సం: 02-215 శరణాగతి

పల్లవి: ఇటువంటివెల్లా నీకే యిట్టే సెలవు వేసితి
తటుకన నీవనే నిధానము చేకొంటివి

చ. 1: కామించితి నాత్మ నిన్నుఁ గలసి భోగించుటకు
వేమరుఁ గ్రోధించితి నీవిరోధులపై
నేమమున లోభించితి నీమంత్రమన్యుల కియ్య
ఆముకొని మోహించితి హరి నీరూపునకు

చ. 2: యెఱుకతో మదించితి యిట్టే నీదాస్యమున
మఱి నిన్నొల్లని చదువు మచ్చరించితి
తఱిఁ జలపట్టితి నీతప్పని భ క్తియందు
వెఱవక నిన్నొల్లని విధుల నిందించితి

చ. 3: కల కర్మములెల్లా నీకైంకర్యములందు వెట్టితి
బలు మమకారము నీపైఁ జేర్చితిఁ
యెలిమి శ్రీవేంకటేశ యిన్నిటా నన్నేలితివి
నిలిచిన కాలమెల్లా నీసేవే చేసితి