పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/214

ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0147-03 కేదారగౌళ సం: 02-213 అధ్యాత్మ

పల్లవి: తనలోనుండిన హరి దాఁ గొలువఁడీ దేహి
యెనలేక శరణంటే నితఁడే రక్షించును

చ. 1: కోరి ముదిమి మానుపుకొనే యాస మందులంటా
వూరకే చేఁదులు దిన నొడఁబడును
ఆరూఢి మంత్రసిద్ధుఁడనయ్యేననే యాసలను
ఘోరపుఁబాట్లకు గక్కున నొడఁబడును

చ. 2: యిట్టె యక్షిణిఁ బంపు సేయించుకొనే యాసలను
వొట్టి జీవహింసలకు నొడఁబడును
దిట్టతనముఁ దా నదృశ్యము సాధించే యాస
జట్టిగ భూతాలఁ బూజించఁగ నొడఁబడును

చ. 3: చాపలపు సిరులకై శక్తిఁ గొలిచే యాసను
వోపి నిందలకు నెల్లా నొడఁబడును
యేపున శ్రీవేంకటేశుఁ డేలి చేపట్టినదాఁకా
ఆఁపరాని యాస నెందుకైనా నొడఁబడును