పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/213

ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0147-02 వరాళి సం: 02-212 శరణాగతి

పల్లవి: మహినుద్యోగి గావలె మనుజుఁడైనవాఁడు
సహజివలె నుండేమీ సాధింపలేడు

చ. 1: వెదకి తలచుకొంటే విష్ణుఁడు గానవచ్చు
చెదరి మఱచితే సృష్టి చీఁకటౌ
పొదలి నడచితేను భూమెల్లా మెట్టి రావచ్చు
నిదిరించితేఁ గాలము నిమిషమై తోఁచు

చ. 2: వేడుకతోఁ జదివితే వేదశాస్త్రసంపన్నుఁడౌ
జాడతో నూరకుండితే జడుఁడౌను
వోడక తపసియైతే వున్నతోన్నతుఁడౌ
కూడక సోమరియైతే గుణహీనుఁడౌను

చ. 3: మురహరుఁ గొలిచితే మోక్షము సాధించవచ్చు
వెరవెఱఁగకుండితే వీరిడియౌను
శరణంటే శ్రీవేంకటేశ్వరుఁడు రక్షించును
పరగ సంశయించితే పాషండుఁడౌను