పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/194

ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0143-05 దేసాళం సం: 02-193 వైరాగ్య చింత

పల్లవి: ఇందరి బ్రదుకులును యీశ్వరుని చేతి దే
యెందూ సుజ్ఞానులునిన్నే యెఱిఁగి కొలిచిరి

చ. 1: నినుఁ గనుఁగొనలేక నీచేఁత దెలియక
మనుజులదృష్టమని మది నెంతురు
అనిశము నీసృష్టి యిట్లని నిశ్చయించరాక
తనరఁ గొందరు తమతమ కర్మ మందురు

చ. 2: మహి నీలీల లెంచక మహిమలు దెలియక
బహుగతి జగత్తు స్వభావ మందురు
నిహితమై నీ వింతటా నిండుకుండుట చూడక
తహతహఁ గొందరు యింతా మిథ్య యందురు

చ. 3: భావములోన నిన్ను భావించ వసముగాక
ఆవల నిరాకారమని యందురు
శ్రీవేంకటేశ నీవు చేరి యెదుట నుండఁగా
దేవుఁడు మనవాఁడుగా తెలిసితి మందురు