పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/193

ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0143-04 కన్నడగౌళ సం: 02-192 శరణాగతి

పల్లవి: నీవు నన్ను రక్షించితే నింద నీపై బడదు
భావించి నన్నెట్టయినా బ్రదికించుకొనవే

చ. 1: సంతతము నన్నెంచితే సర్వాపరాధి నేను
యెంత నే వేమిచేసినా నంత కర్హుఁడ
అంతటి లోకజననియైన లక్ష్మిఁ జూచి కాని
అంతరాత్మ నిన్నుఁ జూచియైనా మన్నిఁ చవే

చ. 2: కలవెన్నైనాఁ దప్పులు కనఁగొన నావల్ల
చెలఁగి యందుకుఁ బ్రాయశ్చిత్తము లేదు
లలి నాభుజము చక్రలాంఛనము చూచి కాని
అల నానోరిమంత్రమైనాఁ జూచి యేలుమీ

చ. 3: మతి నిన్నెఱిఁగేనంటే మదోన్మత్తుఁడ నేను
గతి యేది నాకు శ్రీవేంకటగిరినాయక
సతతము నీబిరుదు సారెకుఁ జూచి కాని
ప్రతిలేని నీదయయైనా భావించి చేకొనవే