పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/192

ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0143-03 ఆహిరి సం: 02-191 శరణాగతి

పల్లవి: ఎంత మహిమో నీది యెవ్వరి కలవిగాదు
చింతించితే దాసులకుఁ జేపట్టుఁ గుంచమవు

చ. 1: వూరకే నిన్నెవ్వరికి యుక్తుల సాధింపరాదు
సారెకుఁ దర్కవాదాల సాధింపరాదు
ఆరసి వెదకి ఉపాయముల సాధింపరాదు
భారములేనియట్టి భ క్తసాధ్యుఁడవు

చ. 2: మిక్కుటపు సామర్థ్యాన మెరసి తెలియరాదు
ధిక్కరించి నేర్పులఁ దెలియరాదు
వెక్కసాన భూముల వెదకి తెలియరాదు
మొక్కి నీకు శరణంటే ముందర నిలుతువు

చ. 3: చెలరేఁగి తపములు చేసినా నెఱఁగరాదు
యిల నెన్ని చదివినా నెఱఁగరాదు
నెలవై శ్రీవేంకటేశ నీదాసానుదాసులఁ
గొలిచితేఁ జాలు గక్కునఁ గృపసేతువు