పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/191

ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0143-02 మలహరి సం: 02-190 వైరాగ్య చింత

పల్లవి: దైవమా నీపెరరేఁపణ లివి తప్పక వున్నవి జీవులకు
భావించి కాదని దొబ్బి దీకొనఁగ బ్రహ్మాదులకైనను వసమా

చ. 1: యెక్కడ సిద్ధించు బ్రహ్మచర్యము యెదుటనే కాంతలఁ జూచినవేళను
చక్కఁగా మనోవ్యభిచారంబునఁ జలియించుం గాక
చిక్కునే విరతి ధనధాన్యంబులు చేతికి లోనయినఁ జూచి
వొక్కటియై తా నండే మగ్నమునొందించుం గాక

చ. 2: కలుగునే తనివి బహుపదార్థములు గక్కన నంగళ్లనుఁ జూచి
కొలఁదిమీఱఁ గడుతరితీపులతో కోరుచు నోరూరుం గాక
వలనుగ సమాధి యెటువలె దొరకొను వాజవారణంబులఁ జూచి
యెలమితోడ ముంగిళ్లనెల్లఁ జరియింపించుఁ గాక

చ. 3: యేరీతి నెలకొను నీమీఁదితలఁపు యిహలోకపుసౌఖ్యము చూచి
భారపు లంపటములు పై దగిలించి పనులకుఁ బురికొలుపుఁ గాక
ధారుణి నే నివి గెలుచుట యెన్నఁడు తగ శ్రీవేంకటనాయక నీవే
గారవించి రక్షింపుము నీ కిది కడునుపకారంబౌఁ గాక