పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/190

ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0143-01 గుజ్జరి సం: 02-189 వైరాగ్య చింత

పల్లవి: అన్నియు నడుగవే నేనే మఱచితి నవి హరి నీకే తెలిసినవి
మన్నించి నా కీజన్మ మొసఁగితివి మర్మగాఁడు మన్మథుఁడొఁకడు

చ. 1: పలుజన్మంబులు నేఁ ద్రాగిన చనుఁబాలు గొలిచితే నెన్నౌనో
తలిదండ్రులు మరియెందరో తా మెక్కడ నున్నారో
తిలకింపఁగ నాహారంబునకును తెగినకొలుచు లవి యెన్నెన్నో
యిలపై నే బ్రదికినకాలము యెంతని వ్రాసెనో చిత్రగుప్తుఁడు

చ. 2: చినుఁగఁగఁ జినుఁగఁగఁ గట్టుకోకలకుఁ జెల్లినపత్తి దా నదియంతో
కనక మెంతో నాకాభరణములై కాయంబులతో నొరసినది
పెనఁగీ రమించిన కామినీమణుల పేరు లెన్నియో తొల్లిటివి
ఘనముగ నను నిటు భోగించఁజేసిన కర్మమే యెఱుఁగు నివియెల్లా

చ. 3: గరిమల నే గడియించినయిండ్లుఁ గాణాచిచోట్లు యేడేడో
పొరలిన యిడుమలు యెందుకెక్కెనో పొదలితి భువిపై నిన్నాళ్లు
అరయఁగ నందరి కంతర్యామిని అఖిలకారణంబును నీవే
నిరతపు శ్రీవేంకటేశ్వర దయగల నీచిత్త మెటువలెఁ దలచీనో