పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/183

ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0141-04 రామక్రియ సం: 02-182 అంత్యప్రాస

పల్లవి: పాటెల్లా నొక్కచో నుండు భాగ్య మొక్కచో నుండు
యీటువెట్టి పెద్దతనా లెంచఁ బనిలేదు

చ. 1: సరవిఁ గలకాలముఁ జదువుచుండు నొకఁడు
గరిమ నీకృప నిన్నుఁ గను నొకఁడు
ధరఁ బ్రయాసముతోడఁ దపము సేయు నొకఁడు
శరణుచొచ్చి నీకుఁ జనవరౌ నొకఁడు

చ. 2: వొక్కఁడు మోపుమోచు నొక్కఁడు గొలువుసేయు
వొక్కఁడు పొగడీ త్యాగ మూరకే యందు
వొక్కఁ డాచారము సేయు నొక్కఁడు మోక్షము గను
యెక్కడా నీకల్పన కేమి సేయవచ్చును

చ. 3: భావించనటుగాన ఫలమెల్లా నీమూలము
యేవలనైనా నీవు యిచ్చితేఁ గద్దు
జీవులు నిన్నెఱఁగక చీఁకటి దవ్వఁగనేల
శ్రీవేంకటేశ్వర నిన్ను సేవించేదే నేరుపు