పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/180

ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0141-02 బౌళి సం: 02-179 అధ్యాత్మ

పల్లవి: తెలిసినమాటలు నీసముఖంబున దీకొని ని న్నడుగకపోదు
సులభుఁడ వన్నిట ప్రాణనాథుఁడవు చొప్పుగ నానతి యియ్యఁ గదే

చ. 1: నీవే బలవంతుఁడవో నీకంటేఁ గర్మము బలువో
కైవసముగ నే నెంచిచూచితే కర్మముకంటె బలువుఁడవు
భూవలయంబుల ప్రారబ్ధంబులు భోగించవలెనని యంటివా
వావిరి నిట్టైతే నీదేవత్వమునకు వెలితిగదే

చ. 2: ఐనాఁగాని లోకములోపల నది నీ యాజ్ఞని తలఁచితిమా
నేను నీశరణుచొచ్చిన మీఁదట నీవే పరిహరించఁగవలదా
కానిపించు నాకిఁక నొకబుద్ధి కర్మముపై నెప మటువేసి
పూనుచుఁ గాలక్షేపంబునకై భువిని వినోదము గాఁబోలు

చ. 3: యెందాఁకా జీవులతోడుత నీ వేలాటంబులు జరపెదవు
అందరికిని నీవే తలిదండ్రివి అయి రక్షింపుచునున్నాఁడవు
కందువ దెలిసెను శ్రీవేంకటేశ్వర కర్త వెట్టు చేసిన మేలు
చందమాయ నిది దగవౌ నీకును సంతోషించితి మిటు నేము