పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/176

ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0140-04 దేసాళం సం: 02-175 అధ్యాత్మ

పల్లవి: అక్కటా నే నిర్మలుఁడనయ్యే దిఁక నెన్నఁడో
చక్క నన్ను దిద్దుకోనే సర్వేశ్వరా

చ. 1: నేనే మంచివాఁడనై తే నిండుకోదా జ్ఞానము
కానీలే యింకా నేమేమి గడమో కాక
ఆనుక సుకృతినైతే నలవడదా విర క్తి
కానరాని తప్పు లెన్నిగలవో కాక

చ. 2: నామనసే చక్కనైతే నాకుఁ బ్రత్యక్షము గావా
చేముంచి నేరమేమి సేసితినో కాక
ఆముక మోక్షాధికారినైతే నెదురుగా రాదా
కామితార్థాలు భోగించఁ గలుగఁబోలుఁ గాక

చ. 3: ఔలే నామేను పవిత్రమైతే సేవ గొనవా
యేలాగున్నదో నీచిత్త మెఱఁగఁ గాక
యీలీల శ్రీవేంకటేశ యెదుటనే వున్నాఁడవు
యేలుకొని చేపట్టి యీడేర్చవు గాక