పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/175

ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0140-03 వరాళి సం: 02-174 అధ్యాత్మ

పల్లవి: ఇతరుల దూరనేల యెవ్వరూ నేమి సేతురు
మతి వారూఁ దమవంటి మనుజులే కాక

చ. 1: చేరి మేలుసేయఁ గీడుసేయ నెవ్వరు గర్తలు
ధారుణిలో నరులకు దైవమే కాక
సారెఁ దనవెంటవెంటఁ జనుదెంచేవారెవ్వరు
బోరునఁ జేసిన పాపపుణ్యాలే కాక

చ. 2: తొడఁగి పొగడించాను దూషించా ముఖ్యులెవ్వరు
గుడికొన్న తనలోని గుణాలే కాక
కడుఁగీర్తి నపకీర్తి గట్టెడివారెవ్వరు
నడచేటి తనవర్తనములే కాక

చ. 3: ఘనబంధమోక్షాలకుఁ గారణ మిఁక నెవ్వరు
ననిచిన జ్ఞానాజ్ఞానములే కాక
తనకు శ్రీవేంకటేశుఁ దలపించేవా రెవ్వరు
కొనమొద లెఱిఁగిన గురుఁడే కాక