పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/174

ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0140-02 ముఖారి సం: 02-173 వేంకటగానం

పల్లవి: ఏరీతి నెవ్వరు నిన్ను నెట్టు భావించినాను
వారివారి పాలికి వరదుఁడవౌదువు

చ. 1: చేరికొల్చినవారికిఁ జేపట్టుఁ గుంచమవు
కోరి నుతించినవారికి కొంగుపైఁడివి
మేరతోఁ దలఁచువారి మేటినిధానమవు
సారపు వివేకులకు సచ్చిదానందుఁడవు

చ. 2: కావలెననేవారికి కామధేనువవు మరి
సేవసేసేవారికి చింతామణివి
నీవే గతెన్నవారికి నిఖిల రక్షకుఁడవు
వావిరి శరణువేఁడేవారి భాగ్యరాశివి

చ. 3: నిన్నుఁ బూజించేవారి నిజపరతత్త్వమవు
ఇన్నిటా నీదాసులకు నేలికెవు
యెన్నఁగ శ్రీవేంకటేశ యిహపరములకును
పన్ని కాచుకున్నవారి ఫలదాయకుఁడవు