పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/164

ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0138-04 గుండక్రియ సం: 02-163 వైరాగ్య చింత

పల్లవి: దేహ మిది యొకటే దేవుఁడ నీవొకఁడవే
యీహల రెంట దెప్పర మిదివో మాబదుకు

చ. 1: రాతి రొక్కలోకము రవ్వపడెఁ గలలోన
ఘాతలఁ బగలొక్కలోకము వేగితే
యీతల రెప్పలే మరఁ గిందుకు నందుకుఁ జూడ
యేతుల రెంట దెప్పర మిదివో మాబదుకు

చ. 2: సతి కాఁగిలొకటే జవ్వనపుఁగాఁక రేఁచు
సుత కాఁగిలొక వేరేసుఖమై తోఁచు
మతిలోని మరఁ గింతే మగువలే యిద్దరును
ఇతవై రెంట దెప్పర మిదివో మాబదుకు

చ. 3: దైవమా నిన్నాతుమలోఁ దలఁచి యానందింతు
పూవుల నిన్నుఁ బూజింతు పొంచి వెలిని
శ్రీవేంకటేశ నీసేవలోని మరఁ గింతే
యీవల రెంట దెప్పర మిదివో మాబదుకు