పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/163

ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0138-03 సాళంగనాట సం: 02-162 దశావతారములు

పల్లవి: పేరు నారాయణుఁడవు బెంబాడిచేఁతలు నీవి
నోరు మూసుకున్నఁ బోదు నున్నని నీసుద్దులు

చ. 1: వేసులు మాకుఁ జెప్పె విన భారతముగాఁగ
మోస నీపాలముచ్చిమి మొదలుగాను
రాసికెక్క శుకుఁడు రవ్వగాఁ బొగడఁ జొచ్చె
ఆసలఁ బరకాంతల నంటిన నీసుద్దులు

చ. 2: రంతున వాల్మీకి చెప్పె రామాయణము గాను
సంతగాఁ దాటకాదులఁ జంపినదెల్లా
అంతకముందె నారదుఁడవి దండెమీటి చెప్పె
యింతటా వేఁటాడి జీవహింసలు సేసినది

చ. 3: వేడుక నజుఁడు చెప్పె వేదముగా నీవు దొల్లి
వోడక మీనై కొన్నాళ్లుండితివంటా
తోడనే సప్తరుషులు తొల్లియునుఁ జెప్పిరదె
యీడనే శ్రీవేంకటాద్రి నిరవైతి వనుచు