పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/161

ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0138-01 దేసాళం సం: 02-160 దశావతారములు

పల్లవి: వారిదేపో జన్మము వడి నిన్నుఁ దెచ్చిరి
భారతరామాయణాలై పరగె నీకథలు

చ. 1: భువిమీఁద రావణుఁడు పుట్టగాఁగా రాముఁడవై
తవిలి యిందరికిఁ బ్రత్యక్షమైతివి
వివరింప నంతవాఁడు వెలసితేఁగా నీవు
అవతార మందితే నిన్నందరునుఁ జూతురు

చ. 2: రమణఁ గంసాది యసురలు లూటి సేయఁగాఁగా
తమిఁ గృష్ణావతార మిందరి కైతివి
గములై యంతటివారు గలిగితేఁగా నీవు నేఁడు
అమర జనించి మాటలాడుదు విందరితో

చ. 3: యెంత వుపకారియో హిరణ్యకశిపుఁడు
చెంత నరసింహుఁడ నీసేవ యిచ్చెను
యింతట శ్రీవేంకటేశ యిన్ని రూపులును నీవే
పంతాన నీశరణని బ్రదికితి మిదివో