పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/160

ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0137-06 శంకరాభరణం సం: 02-159 గురు వందన, భగవద్గీత కీర్తనలు

పల్లవి: వట్టిలంపటాలఁ బడి వడఁ బొరలుటకంటే
వొట్టిన విరతి నూరకుండుటే సుఖము

చ. 1: పాపము మానినయట్టి బదుకొక్కటె సుఖము
కోపము విడిచినట్టి గుణమొక్కటి సుఖము
చేపట్టి గురుబుద్ధి సేసేటిదే సుఖము తీ-
దీపులఁ బడనియట్టి దినమే సుఖము

చ. 2: మహిఁ జంచలములేని మనసొక్కటి సుఖము
సహజాచారముతోడి జన్మమొక్కటి సుఖము
యిహపరసాధనపు యెన్నికొక్కటి సుఖము
బహుళపు టాసకంటె పరిపాటి సుఖము

చ. 3: పరులఁ బీడించితేని పసిఁడొక్కటి సుఖము
గరిమ నిజముతోడఁగల మాటలే సుఖము
ధరలో శ్రీవేంకటేశు దాసానుదాఁడయి
సరవితో నడచేటి శాంతమే సుఖము