పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/159

ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0137-05 ధన్నాసి సం: 02-158 వైరాగ్య చింత

పల్లవి: దైవమా నీవే మమ్ము దయదలఁచుట గాక
చేవల నీసేఁతలెల్ల చెల్లును లోకానను

చ. 1: తీపు నంజేవేళ నట్టె తేటఁ బులుసింపౌను
పైపైఁ బుణ్యమయితేఁ బాపమింపౌను
వోపి జంతువుల కివి వొకటొకటికి లంకె
చేపట్టి పాపము లెట్టు సేయకుండవచ్చును

చ. 2: కడుఁ జలువై తేను గక్కన వేఁడింపౌను
చెడని విరతివేళ సిరులింపౌను
వొడలు మోచినవారి కొకటికటికి లంకె
తొడరు భోగాలు మాని తోయ నెట్టువచ్చును

చ. 3: యివియు నీమాయే యిన్నియు నీయాజ్ఞలే
జవళిఁ బ్రాణులకెల్ల సమ్మతైనవి
యివల శ్రీవేంకటేశ యిటు నీకే శరణంటి
తవిలి నీవే గతి దాఁగ నెట్టువచ్చును