పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/157

ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0137-03 సామంతం సం: 02-156 దశావతారములు

పల్లవి: హరి నీ ప్రతాపమున కడ్డమేది లోకమున
సరి వేరీ నీకు మరి సర్వేశ్వరా

చ. 1: నీవు నీళ్ళు నమలితే నిండెను వేదములు
యీవలఁ దలెత్తితేనే యింద్రపదవులు మించె
మోవ మూఁతి గిరిపితే మూడులోకాలు నిలిచె
మోవిఁ బార నవ్వితేనే ముగిసి రసురలు

చ. 2: గోర గీరితే నీరై కొండలెల్లఁ దెగఁబారె
మారుకొంటే బయటనే మడుగులై నిలిచె
చేరి యడుగువెట్టితే శిలకుఁ బ్రాణము వచ్చె
కూరిమిఁ గావలెనంటే కొండ గొడగాయను

చ. 3: కొంగుజారినంతలోనే కూలెను త్రిపురములు
కంగి గమనించితేనే కలిదోషములు మానె
రంగుగ నీశరణంటే రక్షించితి దాసులను
ముంగిట శ్రీవేంకటేశ మూలమవు నీవే