పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/156

ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0137-02 లలిత సం: 02-155 వైరాగ్య చింత

పల్లవి: కటకటా కర్మమా కాలములో మర్మమా
మటమాయైపోతివంటా మది నమ్మివుంటిఁగా

చ. 1: పాపబుద్ధి యాడనుండె పాయము రానినాఁడు
కోప మేడనుండె గర్భగోళమున నున్ననాఁడు
దీపన మేడనుండె దేహధారి గానినాఁడు
యేపున భూమిఁ బుట్టితే నేడనుండి వచ్చెనో

చ. 2: నగుసంసార మెందుండె నరకాన నుండునాఁడు
తగిలి మరణదెస ధనవాంఛ లెందుండె
వొగి లోభ మేడనుండె వొంటినున్నవాఁడు
వెగటై నేఁడెట్టు నన్ను వెదకి పైకొనెనో

చ. 3: బహుబంధా లేడనుండె ప్రళయకాలమునాఁడు
మహిఁ గోరికెలెందుండె మతి మఱచిననాఁడు
యిహమున శ్రీవేంకటేశు శరణంటి నేఁడు
విహితమై మాకు నెట్టు వెఱచెనో తాము