పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/155

ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0137-01 సాళంగనాట సం: 02-154 నృసింహ

పల్లవి: అనుచు దేవగంధర్వాదులు పలికేరు
కనకకశిపు నీవు ఖండించే వేళను

చ. 1: నరసింహ నరసింహ ననుఁగావు ననుఁగావు
హరి హరి నాకు నాకు నభయమీవే
కరిరక్ష కరిరక్ష గతమైరి దనుజులు
సురనాథ సురనాథ చూడు మమ్ముఁ గృపను

చ. 2: దేవదేవ వాసుదేవ దిక్కు నీవే మాకు మాకు
శ్రీవక్ష శ్రీవక్ష సేవకులము
భూవనితనాథ నాథ పొడమె నీప్రతాపము
పావన పావన మమ్ముఁ బాలించవే

చ. 3: జయ జయ గోవింద శరణుచొచ్చేము నీకు
భయహర భయహర పాప మడఁగె
దయతో శ్రీవేంకటేశ తగిలి కాచితి మమ్ము
దయఁజూడు దయఁజూడు దాసులము నేము