పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/154

ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0136-06 సాళంగం సం: 02-153 అంత్యప్రాస

పల్లవి: ఉన్న మంత్రా లిందు సరా వొగి విచారించుకొంటే
విన్నకన్నవారికెల్ల విష్ణునామమంత్రము

చ. 1: పరగఁ బుచ్చకాయలఁ బరసిపోదు మంత్రము
గరిమ ముట్టంటులేని ఘనమంత్రము
వరుస నెవ్వరువిన్నా వాఁడిచెడని మంత్రము
అరయ నిదొక్కటేపో హరినామమంత్రము

చ. 2: యేజాతినోరికైన నెంగిలిలేని మంత్రము
వోజదప్పితేఁ జెడకవుండే మంత్రము
తేజాన నొకరికిస్తేఁ దీరిపోని మంత్రము
సాజమైన దిదేపో సత్యమైన మంత్రము

చ. 3: యిహముఁ బరముఁ దానే యియ్యఁజాలిన మంత్రము
సహజమై వేదాలసార మంత్రము
బహునారదాదులెల్ల పాటపాడిన మంత్రము
విహితమయిన శ్రీవేంకటేశు మంత్రము