పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/152

ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0136-04 శ్రీరాగం సం: 02-151 అన్నమయ్య స్తుతి

పల్లవి: దినము ద్వాదశి నేఁడు తీర్థదివసము నీకు
జనకుఁడ అన్నమాచార్యుఁడ విచ్చేయవే

చ. 1: అనంతగరుడ ముఖ్యులైన సూరిజనులతో
ఘన నారదాది భాగవతులతో
దనుజమర్దనుఁడైన దైవశిఖామణితోడ
వెనుకొని యారగించ విచ్చేయవే

చ. 2: వైకుంఠాన నుండి యాళువారలలోపల నుండి
లోకపు నిత్యముక్తులలోన నుండి
శ్రీకాంతతోడనున్న శ్రీవేంకటేశుఁ గూడి
యీకడ నారగించ నింటికి విచ్చేయవే

చ. 3: సంకీర్తనముతోడ సనకాదులెల్లఁ బాడ
పొంకపు శ్రీవేంకటాద్రి భూమినుండి
లంకె శ్రీవేంకటగిరి లక్ష్మీవిభుఁడు నీవు-
నంకెల మాయింటి విందు లారగించవే