పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/149

ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0136-01 ధన్నాసి సం: 02-148 గురు వందన, నృసింహ

పల్లవి: జ్ఞానయజ్ఞ మీగతి మోక్షసాధనము
నానార్థములు నిన్నే నడపె మాగురుఁడు

చ. 1: అలరి దేహమనేటి యాగశాలలోన
బలువై యజ్ఞానపు పశువు బంధించి
కలసి వైరాగ్యపు కత్తులఁ గోసి కోసి
వెలయ జ్ఞానాగ్నిలో వేలిచె మాగురుఁడు

చ. 2: మొక్కుచు వైష్ణవులనే మునిసభ గూడపెట్టి
చొక్కుచు శ్రీపాదతీర్థ సోమపానము నించి
చక్కఁగా సంకీర్తనసామగానము చేసి
యిక్కువతో యజ్ఞము సేయించెఁబో మాగురుఁడు

చ. 3: తదియ్యగురుప్రసాదపు పురోడాశ మిచ్చి
కొదదీర ద్వయమను కుండంబులు వెట్టి
యెదలో శ్రీవేంకటేశు నిటు ప్రత్యక్షముచేసె
యెదివో స్వరూపదీక్ష యిచ్చెను మాగురుడు