పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/142

ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0134-05 పాడి సం: 02-141 వైరాగ్య చింత

పల్లవి: చూచే చూపొకటి సూటిగుఱి యొకటి
తాచి రెండు నొకటైతే దైవమే సుండీ

చ. 1: యేనుగఁ దలఁచితే యేనుగై పొడచూపు
మాను దలఁచిన నట్టే మానై పొడచూపు
పూని పెద్దకొండ దలపోయఁ గొండై పొడచూపు
తానే మనోగోచరుఁడు దైవమే సుండీ

చ. 2: బట్టబయలు దలఁచ బయలై పొడచూపు
అట్టె యంబుధి దలఁచ నంబుధియై పొడచూపు
పట్టణము దలఁచిన పట్టణమై పొడచూపు
తట్టి మనోగోచరుఁడు దైవమే సుండీ

చ. 3: శ్రీవేంకటాద్రిమీఁది శ్రీపతి దలఁచితేను
శ్రీవేంకటాద్రిమీఁది శ్రీపతై పొడచూపు
భావమే జీవాత్మ ప్రత్యక్షము పరమాత్మ
తావు మనోగోచరుఁడు దైవమే సుండీ