పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/135

ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0133-03 లలిత సం: 02-134 భక్తి

పల్లవి: షోడశకళానిధికి షోడశోపచారములు
జాడతోడ నిచ్చలును సమర్పయామి

చ. 1: అలరు విశ్వాత్ముకున కావాహన మిదె పర్వ-
నిలయున కాసనము నెమ్మి నిదె
అల గంగాజనకున కర్ఘ్యపాద్యాచమనాలు
జలధిశాయికిని మజ్జన మిదె

చ. 2: వర పీతాంబరునకు వస్త్రాలంకార మిదె
సరి శ్రీమంతునకు భూషణము లివె
ధరణీధరునకు గంధపుష్ప ధూపములు
తిర మిదె కోటిసూర్యతేజునకు దీపము(???)

చ. 3: అమృతమథనునకు నదివో నైవేద్యము
గమిఁ జంద్రనేత్రునకుఁ గప్రవిడెము
అమరిన శ్రీవేంకటాద్రిమీఁది దేవునికి
తమితోఁ బ్రదక్షిణాలు దండములు నివిగో