పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/113

ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0119-04 నాట సం: 02-112 నృసింహ

పల్లవి: అహోబలేశ్వరుఁ డరికులదమనుఁడు
మహామహిమలను మలసీ వాఁడే
    
చ. 1: కదలుఁ గన్నులును కరాళవదనము
గుదిగొను భయదపుఁ గోరలును
అదరు మీసములు నలరఁగ నవ్వుచు
వుదుటు తోడఁ గొలువున్నాఁడు వాఁడె
    
చ. 2: అతిసిత నఖములు ననంత భుజములు
వితతపరాక్రమ వేషమును
అతులదీర్ఘజిహ్వయుఁ గడు మెరయఁగ
మితిలేని కరుణ మెరసీ వాఁడే
    
చ. 3: సందడి సొమ్ములు శంఖచక్రములు
పొందుగ దివిజులు పొగడగను
యిందిరఁ దొడపై నిడి శ్రీవేంకట-
మందు నిందు గడుఁ నలరీ వాడే