పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/579

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0197-5 గౌళ సంపుటం: 07-577

పల్లవి:
ఆయము నీచేతనున్నదన్నిటికిని
పాయముపదను వచ్చెఁ బైకొనవయ్యా

చ.1:
అలిగినదానివలెనంటక వున్నది గాని
నిలువెల్లాఁ దమకమే నీమీఁదను
బలిమేపాటిసేసిన పైపైనున్నద్‌ చెలి
చెలులఁ జూపక నీవే చేయి చాఁచవయ్యా

చ.2:
యెనయనిదానివలె నెక్కడో చూచీఁ గాని
తనువెల్లనాసలే తగులమికి
చెనకితేఁ జాలుఁగాని చేతిలోనున్నది యింతి
పెనఁగదు పిలిచితేఁ బేరుకొనవయ్యా

చ.3:
సిగ్గువడ్డదానివలె శిరసు వంచీఁ గాని
అగ్గలికెల్లా నీసామ్మై ఆముకొన్నది
అగ్గమై శ్రీ వెంకటాధిప నిన్నుఁ గూడెను
యెగ్గులేదు మీలోన నిట్టే వుండవయ్యా