పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/548

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0192-4 కన్నడగౌళ సంపుటం: 07-546

పల్లవి:
వలచినదానఁ దొల్లే వడి మనసు మెత్తన
నిలువునఁ గరఁగుదు నీకొరకేపొద్దును

చ.1:
చెమ్మగిలీ దేహమెల్లా చేతుల నీవంటితేనే
వుమ్మడినించుకవడి వుండరా నీవు
దిమ్మురేఁగీ నిట్టూర్చు దిట్టించి నీవు చూచితె
కమ్ముక నీపచ్చడము కప్పరా నాకు

చ.2:
చెక్కులెల్లాఁ బులకించె సిగ్గులు మోవనాడితే
వొక్కరీతిఁ గొంతవడి వుండరా నీవు
లక్కవంటిది నాగుండె లలిమీరీ నీసుద్దుల
యిక్కువకు వచ్చి చనవియ్యరా నాకు

చ.3:
కన్నులనే చొక్కుదేరీ కాఁగిట నన్నుఁ గూడితే
వున్నవేమిఁ దడవక వుండరా నీవు
యెన్నిక శ్రీ వెంకటేశ యియ్యకొంటి పనులెల్ల
మిన్నక నీగందమిట్టె మెత్తరా నాకు