పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/128

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0033-5 శ్రీరాగం సంపుటం: 06-128

పల్లవి:

ఎఱుంగుదు మిదే నీయేతు లెల్లా
తెఱవల నిటు దినదినము నేఁచేవు

చ. 1:

చూపులనే తనిపేవు సొలపు లాడేవు
తీపులం గ్రిందుపడేవు తేలించేవు
ఆపనికి బెట్టుగా న న్నదలించేవు
మాపటి చేఁతలకే మచ్చిక చల్లేవు

చ. 2:

అడుగరాని దడిగే వాసలు సేసేవు
మడుగులు గలంచేటి మాట లాడేవు
అడరి రాయి గరంగ నలపు చూపేవు
వడి నందనిపనికి వలపు చల్లేవు

చ. 3:

చీర వెలిగా నవ్వేవు సిగ్గు విడిచేవు
మోర నిడుపు చేసుక మూఁతులు నాఁకేవు
చేరి చెఱంగు వట్టేవు శ్రీవేంకటేశుండా
సారెకు నిట్టే కూడేవు చనువు లిచ్చేవు