పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/350

ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0067-03 శ్రీరాగం సం: 01-348 అంత్యప్రాస


పల్లవి:
ఏఁటి బ్రదుకు యేఁటి బ్రదుకు వొక్క
మాటలోనే యటమటమైన బ్రదుకు

చ.1:
సంతకూటములే చవులయిన బ్రతుకు
దొంతిభయములతోడి బ్రదుకు
ముంతనీళ్ళనే మునిఁగేటి బ్రదుకు
వంతఁ బొరలి కడవరంలేని బ్రదుకు

చ.2:
మనసుచంచలమే మనువయిన బ్రదుకు
దినదినగండాలఁ దీరు బ్రదుకు
తనియ కాసలనె తగిలేటి బ్రదుకు
వెనకముందర చూడ వెరపయిన బ్రదుకు

చ.3:
తెగి చేఁదె తీపయి తినియేటి బ్రదుకు
పగవారిపంచలపాలైన బ్రదుకు
తగువేంకటేశ్వరుఁ దలఁచని బ్రదుకు
పొ గకు నోపక మంటఁ బొగిలేటి బ్రదుకు