పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/2

ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0001-01 సామంతం సం: 01-001 అధ్యాత్మ

పల్లవి: వలచి పైకొనఁగరాదు వలదని తొలఁగరాదు
కలికిమరుఁడు సేసినాజ్ఞ కడవఁగరాదురా
    
చ. 1: అంగడి కెత్తినట్టిదివ్వె లంగనముఖాంబుజములు
ముంగిటి పసిఁడికుంభములును ముద్దుల కుచ యుగంబులు
యెంగిలిసేసినట్టితేనె లితవులైన మెఱుఁగుమోవులు
లింగములేని దేహరములు లెక్కలేని ప్రియములు
    
చ. 2: కంచములోని వేఁడికూరలు గరువంబులుఁ బొలయలుకలు
యెంచఁగ నెండలోనీడలు యెడనెడకూటములు
తెంచఁగరాని వలెతాళ్ళు తెలివిపడనిలేఁతనవ్వులు
మంచితనములోని నొప్పులు మాటలలోనిమాటలు
    
చ. 3: నిప్పులమీఁద జల్లిననూనెలు నిగిడితనివిలేనియాసలు
దప్పికి నేయిదాగినట్లు తమకములోనితాలిమి
చెప్పఁగరానిమేలు గనుట శ్రీవేంకటపతిఁ గనుటలు
అప్పనికరుణగలిగి మనుట అబ్బురమైనసుఖములు