పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/184

ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0030-02 పాడి సం: 01-183 ఉత్సవ కీర్తనలు


పల్లవి:

 చక్రమా హరి చక్రమా
వక్రమైన దనుజుల వక్కలించవో


చ. 1:

 చుట్టి చుట్టి పాతాళము చొచ్చి హిరణ్యాక్షుని-
చట్టలు చీరిన వో చక్రమా
పట్టిన శ్రీహరి చేతఁ బాయక యీ జగములు
వొట్టుకొని కావగదవో వో చక్రమా


చ. 2:

 పానుకొని దనుజుల బలుకిరీటమణుల
సానలఁ దీరిన వో చక్రమా
నానాజీవముల ప్రాణములుగాచి ధర్మ-
మూని నిలుపఁగదవో వో చక్రమా


చ. 3:

 వెఱచి బ్రహ్మాదులు వేదమంత్రముల నీ
వుఱుట్లు గొనియాడేరో చక్రమా
అఱిముఱిఁ దిరు వేంకటాద్రీశు వీధుల
వొఱవుల మెఱయుదువో వో చక్రమా