పుట:తాలాంకనందినీపరిణయము (49-64పుటలు).pdf/3

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము 51


క.

ఈకన్యకామణికి యిపు
డా కవ్వడిచే జనించునట్టి కుమారు
న్నా కలిమికి రాజ్యమున క
నాకులగతి నాథుఁ జేతు నని సమ్మతుఁడై.

214


చ.

అని యిటు లుత్సహించి శుభమైన ముహూర్తము నిశ్చయించి, మే
ల్దనరుపనుల్ రచించి, విబుధప్రతతిం బిలిపించి, పెండ్లికూఁ
తునకు నలంకరించి, పటుతూర్యనినాదము మించి దిక్కులం
బెనఁగొన మేళవించి పురవీధుల చిత్రము లేర్పరించియున్.

215


చ.

వరుస నవద్యహృద్యశుభవాద్యము లెల్లెడ నిండి మ్రోయ క
ప్పురఁపుమెఱుంగుటారతులు పుణ్యవధూజను లీయ, వృద్ధభూ
సురవరు లాగమప్రథితసూక్తుల దీవన లీయ, పాండ్యభూ
వరసుతకు, గిరీటికి వివాహ మొనర్చి రతిప్రమోదులై.

216


తే.

మధురవృత్తులు రీతులు పృథుగుణములు
గలుగు కూతురునకు నలంకారము లిడి
పాండుసుతునకు మలయధ్వజుం డొసంగె
కవి రసజ్ఞుకు కృతినిచ్చు కావ్య మనఁగ.

217


మ.

ఇటులం బెండ్లి యొనర్పఁ బిమ్మట నరుం డిచ్ఛారతిం గొన్నినా
ళ్ళట చింత్రాంగదకేళికారతిసుఖయత్తాత్ముఁడై యుండున
ప్పట నయ్యంగన కందిపుచ్చుకొనుఠేవం గర్భచిహ్నంబు లం
తట జూపట్టె నహస్కరాభ్యుదయప్రోద్యత్పూర్వశైలక్రియన్.

218


క.

తొమ్మిదినెల లీగతి నతి
నెమ్మదిగా గడచినంతనే శుభమౌ ల
గ్నమ్మిదియని వినుతింపఁగ
నమ్మదిరాక్షికిని తనయుఁ డపు డుదయించెన్.

219


క.

తనమనుమని గనుఁగొని నం
తన యనుకంప పాండ్యధరణీపతియుం