పుట:తాలాంకనందినీపరిణయము (49-64పుటలు).pdf/12

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60 తాలాంకనందినీపరిణయము


వరులు విరులను వర్షింప సిరుల బెంపఁ
దరమె వినుతింపఁ బడఁతి కాతఁడు జనింప.

258


క.

నెనరున గుంతీసతి దా
గనుఁగొని గనుగొనల వివిధగతులన్ మతులన్
జనువనుఁగుల్ బెనఁగొనఁగన్
మనుమని మను మనుచు దీవెనల నిడి వేడ్కన్.

259


క.

నరుడుం గన్నకుమారుని
పురుఁడుం గణుతింపఁగలఁడె భువనత్రయి న
మ్మరుఁడుం గలఁడేమో యని
బురుఁడుం గావించి రఖిలపుణ్యాంగనలున్.

260


ఉ.

ధన్యుఁడు కల్పకప్రతివదాన్యుఁడు విశ్రుతరాజలోకమూ
ర్ధన్యుఁ డనారతాశ్రితశరణ్యుఁడు రూపవిలక్షణైకసౌ
జన్యుఁడు దుష్కరారిజయసైన్యుఁ డితం డగుగాక యంచు స
న్మాన్యుఁడు ధర్మసూనుఁ డభిమాన్యుఁ డనన్ మహదాహ్వయం బిడెన్.

261


సీ.

సకలాగమాంతభాసకళాప్తిచే బృహ
     స్పతిరీతిని మహానుభావుఁ డగును
నిఖిలాస్త్రశస్త్రప్రముఖనీతి చతురత
     పరశురామసమప్రభావుఁ డౌను
సంతతాత్మజ్ఞానసంసర్గను సనత్కు
     మారునిగతి జగన్మాన్యుఁ డగును
కమనీయసుందరాకారగౌరవమున
     కందర్పకోటిసంకాశుఁ డగును


తే.

ననుచు దీవించి ధర్మజుం డతిశయించి
దానము లొనర్చి జాతకోత్సవ మొనర్చె
బ్రియము మొనదేల నిధిఁ గన్న బేదలీల
నుల్ల మిగురింప నభిమన్యుఁ డుద్భవింప.

262