పుట:తాలాంకనందినీపరిణయము (49-64పుటలు).pdf/10

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58 తాలాంకనందినీపరిణయము


ఫాలంబు నంటి తత్పదనఖరేఖలా
     మృత్న్సోర్ధ్వపుండ్రసమృద్ధిఁ దెలుప


తే.

నంగజానందయోగాంతరంగుఁ డౌచు
ప్రేమనధరామృతాతిథ్యభిక్ష మెసఁగి
యోగియో గాక కామినీభోగియో య
నంగ వెడలెను దత్కేళికాంగణంబు.

248


శా.

ఈలీలన్ సుఖవార్ధినిం దనిసి లక్ష్మీశుండు వీడ్కొల్పఁగా
చాలాప్రేమను రుక్మిణీముఖసతుల్ స్రక్చందన స్వర్ణవ
స్త్రాలంకారము లిచ్చిపంపిన బురం బర్థిన్ బ్రవేశింపఁ బో
నాలో కొందఱు సీరపాణిహితు లుద్యత్కోవసన్నద్ధులై.

249


ఉ.

దొంగవలెన్ సుభద్ర నదె దోకొనిపోయె కిరీటి యంచు ను
త్తుంగబలాంగులై తనునెదుర్కొనువారి నెదిర్చి యాధను
శ్చంగుఁడు పుష్పసంభృతనిషంగుఁ డఱంగఁడె లోనగెల్చి య
బ్భంగి శుభాంగితోఁ జనియె భంగజయంగతపేటి వీటికిన్.

250


క.

నానావిధవాద్యంబుల
నూనగతిన్ మ్రోయఁ బురజను లెదుర్కొనఁగా
సూనాస్త్రకోటి రుచిరన
వీనాంగుఁడు తత్పురప్రవేశం బాయెన్.

251


క.

సతిపతు లీరీతి ననా
రతము హితము దోప సౌఖ్యరతి మెలఁగుతఱిన్
కతిపయదినములకును త
తృతి క తికుతుకతను నెలమసలె సలలితమై.

252


చ.

తనువు చెమర్పసాగె, కనుదమ్ముల మబ్బు ఘటిల్లె వేవిళు
ల్గనఁబడె చన్మొనల్ నలుపుఁ గాఁదగె చెక్కులు వెల్లనయ్యె భో
జనము లసహ్యమయ్యె గతిజాడ్యత గాంచెను. మంటిపెల్లలం
దున రుచిమించె జిట్టములుదోఁచె కటిం బెగడయ్యెఁ బోటికిన్.

253