పుట:తల్లిదండ్రుల మరియు వయోవృద్ధ పౌరుల భరణ, పోషణ మరియు సంక్షేమ చట్టము, 2007.pdf/3

ఈ పుట ఆమోదించబడ్డది

తల్లిదండ్రుల మరియు వయో వృద్ధ పౌరుల భరణ పోషణ

మరియు సంక్షేమ చట్టము, 2007

(2007లోని 56వ చట్టము)

[29 డిసెంబరు, 2007]

సంవిధానము క్రింద హామీ ఒసగబడిన మరియు గుర్తింపబడిన తల్లిదండ్రులు మరియు వయోవృద్ధ పౌరుల భరణ పోషణ మరియు సంక్షేమమునకుగాను సమర్ధవంతమైన నిబంధన చేయుట కొరకు మరియు దానికి సంబంధించిన లేక అనుషంగికమైన విషయములను నిబంధించుటకైన చట్టము.

భారత గణరాజ్యము యొక్క యాభై ఎనిమిదవ సంవత్సరములో పార్లమెంటుచే ఈ క్రింది విధముగా శాసనము చేయబడినది:-

అధ్యాయము -1

ప్రారంభిక

1. (1) ఈ చట్టమును తల్లిదండ్రుల మరియు వయోవృద్ధ పౌరుల భరణ పోషణ మరియు సంక్షేమ చట్టము, 2007 అని పేర్కొనవచ్చును.

(2) ఇది జమ్ము మరియు కాశ్మీరు రాజ్యము మినహా యావత్ భారత దేశమునకు విస్తరించును మరియు భారతదేశము వెలుపలి భారత పౌరులకు కూడా వర్తించును.

(3) ఇది ఒక రాజ్యములో, రాజ్య ప్రభుత్వము అధికారిక రాజపత్రములో అధిసూచన ద్వారా నియతము చేయునట్టి తేదీన అమలులోనికి వచ్చును.

2. ఈ చట్టములో, సందర్భమును బట్టి అర్ధము వేరు విధముగా ఉన్ననే తప్ప:-

(ఎ) "సంతానము” అను పదములో కుమారుడు, కుమార్తె, మనుమడు మరియు మనుమరాలు చేరి ఉండును. అయితే మైనరు చేరి ఉండరు;

(బి) “భరణ పోషణ” అను పదములో ఆహారము, దుస్తులు, నివాసము, వైద్య సదుపాయము మరియు చికిత్సకు సంబంధించిన ఏర్పాటు చేరి ఉండును;

(సి) "మైనరు” అనగా మెజారిటీ చట్టము, 1875 యొక్క నిబంధనల క్రింద మెజారిటీ వయస్సురాని ఎవరేని వ్యక్తి అని అర్ధము;