పుట:తరికొండ నృసింహశతకము (తరికొండ వేంగమాంబ).pdf/50

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

మఱపున జీవుఁ డెప్పటికి [1]మాయనుదానికిఁ జిక్కి, తాను నా
యెఱుకను నిల్వనీయకను, నెప్పుడు మద్గురు వాక్యసంగతుల్
మఱచెదనంచుఁ బోయినను, మక్కువతోడుత నన్నుఁబ్రోవ స
ద్గురుఁడటు పోవనీఁడు; తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

37

భావం:

దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనృసింహదేవా! మాయ అనే దాని చేతిలో చిక్కిన ఈ జీవుడు, నా గురువర్యుడు ఉపదేశించిన వాక్యాలను - జ్ఞానాన్ని ప్రసాదించే వాటిని - ఏమఱుపాటున మరచిపోవడానికి పాల్పడినా గురువర్యుడు నా యెడ వాత్సల్యంతో కూడిన ప్రీతితో, తాను ఉపదేశించిన ఆ వాక్యాలనూ, వాటి ఫలితమైన జ్ఞానాన్నీ మఱువనీయక, నన్నూ, నా యెఱుకనూ అల్లాగే కాపాడుతూవున్నాడు కదా! (నా గురువర్యునికి నాయందు గల వాత్సల్యం అలాంటిది!)

  1. 'మాయ+అనుదానికి' - అని పదవిభాగము