పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/59

ఈ పుట ఆమోదించబడ్డది

56

జమీందారులకు, ప్లాంటర్లకు, మహాజనులకు (వడ్డీ వ్యాపారస్థులు) వ్యతిరేకంగా పోరాటాలు సాగించేందుకు పటిష్టమైన సమరశీల వ్యవస్థలను రూపొందించారు. ప్రజా వ్యతిరేక శక్తులకు అండగా నిలుస్తున్న బ్రిటిష్‌ ప్రభుత్వాన్నిఎదుర్కోవడానికి ఫరాజీలను పోరాట యోధులుగా తీర్చీదిద్ది, ఆంగ్లేయుల, వారి తాబేదార్ల ఆగడాలను అడ్డుకున్నారు.

ఫరాజీ ఉద్యమ వ్యవస్థను పటిష్టం చేసిన దూదుమియా ఫరీద్‌పూర్‌ను కేంద్రంగా చేసు కుని కార్యకలాపాలు నడిపారు. ప్రజాస్వామ్య రీతిలో పంచాయితీల వ్యవస్థను ఏర్పాటు చేశారు. దూదు మియా ఆజ్ఞలు భగవంతుని ఆజ్ఞలతో సమానంగా భావించి ఫరాజీలు తు.చ తప్పక అమలు చేశారు. ఆ కారణంగా ఆ వ్యవస్థను state with in the state గా చరిత్రకారులు అభివర్ణించారు. దూదుమియా పిలుపిస్తే క్షణాలలో హాజరుకావడానికి 50 వేల మంది ఎల్లప్పుడు సిధంగా ఉంటారు అని అంగ్లేయాధికారులు తమ నివేదికలలో వెల్లడించడాన్ని బట్టి వ్యవస్థాపరంగా ఆయన ఉద్యమ నిర్మాణ దక్షత వెల్లడవుతుంది.

దూదుమియా ఉద్యమాన్ని ఏ విధంగానూ నిలువరించలేకపోయిన ఆంగ్లేయులు, ఆయన పోరాట పటిమ ముందు నిలబడలేకపోయిన ఆంగ్లేయల అనుచరవర్గం దూదు మియా మీద, ఫరాజీ ఉద్యమకారుల మీద పలు క్రిమినల్‌ కేసులనుపెట్టించి వారికి శిక్షలు పడేలా శతవిధాల విఫల ప్రయత్నాలు చేశారు. చివరకు దూదుమియాను జైలులో కూడా పెట్టించారు. అధికారులు వారి తొత్తులు ఆయన మీద చేసిన ఆరోపణలను రుజువు చేయలేక పోవటంతో ఆ కేసులన్నింటినీ న్యాయస్థానాలు కొట్టివేశాయి.

ప్రథమ స్వాతంత్య్రసంగ్రామ సమయంలో ఫరాజీలు విజృంభించగలరని భయపడ్డ ప్రభుత్వం దూదుమియాను, ఆయన అనుచరులను పెద్దసంఖ్యలో జైళ్ళల్లో కుక్కింది. అయినా ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో ఫరాజీల జాడలు చాలా స్పష్టంగా కన్పించాయని ఆంగ్లేయాధికారుల రికార్డులు వెల్లడించాయి. జైలు నుండి విడుదలైన దూదుమియా ప్రస్తుత బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాను స్థిరనివాసం చేసుకుని ఫరాజీల ధార్మిక, లౌకిక సిద్ధాంతాలను పరిపుష్టం చేయడంలో గడిపారు.

చివరిక్షణం వరకు ఆంగ్లేయుల ఆగడాలను, అధికారుల పెత్తనాన్ని వ్యతిరేకించిన ఆయన ప్రజల హృదయాలలో నిలచిపోయారు. ఈనాటికి తూర్పుబెంగాల్‌ ప్రాంతాలలో ఫరాజీ సాంప్రదాయాలను పాటించే జనావళి కన్పించటం అందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్‌ తారాచంద్‌చే ఫిరంగీల పాలనను తుడిచి పెట్టాలని జీవితాంతం శ్రమించిన పోరాటయోధుడు గా కీర్తించబడిన దూదుమియా 1860లో అస్తమించారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌