పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/197

ఈ పుట ఆమోదించబడ్డది

194

ఖద్దరు ధారించారు. పేదరికంతో సతమతమౌతున్నా కూడా ఆయన మహాత్ముని బాట విడనాడలేదు. మంచి ప్రభుత్వం ఉద్యోగం వచ్చినా వదలుకొని తనను తాను పూర్తిగా జాతీయోద్యమానికి అంకితం చేసుకున్నారు. గుంటూరు బ్రాడీపేటలో తన సోదరుని పేరిట ప్రారంభించి ఆయన నిర్వహించిన లాండ్రీ, ఆనాడు గుంటూరు కేంద్రంగా సాగిన జాతీయోద్యమకారులకు రహాస్య కూడలి కేంద్రంగా పేర్గాంచింది.

ఆ క్రమంలో 1930 నుండి ఆయన కార్యక్రమాలు మరింతగా పరిణితి చెందాయి. మహాత్మాగాంధీ పిలుపుమేరకు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని శిక్షలను అనుభవించారు. బ్రిటిషర్ల పై పోరాటం సాగించమని పిలుపునిచ్చిన పలువురు ముసిం ఉలేమాల స్పూర్తితో ముందుకు సాగిన గాలిబ్‌, హిందూ-ముస్లింల ఐక్యతను ప్రగాఢంగా వాంఛించారు.

1937 నుండి 1941 వరకు ఆయన ముస్లిం మాస్‌ కాంటాక్ట్ మూమెంట్ కార్యదర్శిగా బృహత్తర బాధ్యతలను నిర్వహించారు. ఆ సమయంలో 1937 నుండి 1941వరకు గుంటూరు పురపాలక సంఘం సభ్యులుగా బాధ్యతలను చేపట్టారు. 1940లో జరిగిన వ్యక్తిగత సత్యాగ్రహంలో,1942లో సాగిన క్విట్ ఇండియా ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గోని అనుభవించిన కరినకారాగార శిక్షల వలన ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణంచింది. అయినా ప్రాణమున్నంతవరకు పోరాటం సాగించాలని పట్టుదలతో జాతీయోద్యమ కార్యక్రమాలలో పాల్గొన్న ఆయనకు 1947లో మద్రాసులో శస్త్రచికిత్స తప్పలేదు.

1947 తరువాత ఆనారోగ్యం నుండి బయటపడిన షేక్‌ గాలిబ్‌ సాహెబ్‌ రాష్ట్ర రాజకీయాలలో కీలక పాత్ర వహించారు. గుంటూరు పురపాలక సంఘం సభ్యునిగా, 1950 నుండి 1952 వరకు ప్రొవిజనల్‌ పార్లమెంటులో సభ్యులుగా బాధ్యతలు నిర్వహించారు. 1954లో ఆయనకు రాజ్యసభ సబ్యునిగా పదవి లభించింది. ఆ పదవిలో ఆయన 1958 వరకు ఉన్నారు.

త్యాగపూరిత జీవితానికి ఆదర్శమైన గాలిబ్‌ తన సహచరులు, మిత్రులైన బెజవాడ గోపాల రెడ్డికి రాజ్యసభలో సీటును కల్పించేందుకు తన పదావీకాలం పూర్తికాక ముందే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తరువాత 1958 నుండి 1969 వరకు రాష్ట్ర విధాన పరిషత్‌ సభ్యులుగా భాధ్యతలు నిర్వహించారు. ప్రతిష్టాత్మక గుంటూరు అంజుమన్‌ ఇస్లామియాకు సుదీర్గకాలం అద్యక్షులుగా పనిచేసి చరిత్ర సృష్టించారు.

ఈ విధగా చిన్న వయస్సులోనే జాతీయోద్యమంలో ప్రవశించి, విద్యార్థి, యువజన ఉద్యమాల నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించి, ప్రజాప్రతినిధిగా ప్రజా సేవకు అంకితమైన షేక్‌ గాలిబ్‌ సాహెబ్‌ 1970 ఆగస్టు 21న కన్నుమూశారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌