పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/169

ఈ పుట ఆమోదించబడ్డది

166

అందుకున్నారు. ఒక వైపు సాహిత్యవేత్తగా కృషి సాగిస్తూ ముస్లిం జన సముదాయాల పరిస్థితులను, పరాయి పాలకుల దుశ్చర్యలను గమనించిన ఆయన 1904 లో జరిగిన అఖిల భారత ముస్లిం విద్యా సదస్సులో, అఖిల భారత ముస్లిం పత్రికా సంపాదకుల సమావేశాల్లో పరిష్కారాలను సూచించారు. ముసింలీగ్ ఆలోచనలతో బయలుదేరిన ఆయన చివరకు పరాయి పాలనకు స్వస్థిపలకాలంటే సాయుధపోరాటమే శరణ్యమనుకుని దారుల్‌ ఇర్షాద్‌ మరియు హిజుబుల్లా అను విప్లవ సంఘాలను ఏర్పాటు చేశారు.

ఆ సందర్భంగా ఎదురైన అనుభవాల దృష్ట్యాహిందూ-ముస్లింల మధ్య ఐక్యత కోసం జీవితాంతం కృషి చేశారు. స్వరాజ్యం కంటే హిందూ- ముస్లింల ఐక్యత ప్రదానమని ప్రకటించారు.1920 జనవరిలో మొదటిసారిగా మహాత్మాగాంధీని కలుసుకున్నారు. అప్పటి నుండి ఆజాద్‌ విప్లవబాటను వీడి అహింసా మార్గాన ఖిలాఫత్‌-సహాయనిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ తరువాత స్వరాజ్య సంపాదన వరకు సాగిన వివిధ పోరాట రూపాలలో ప్రదాన పాత్ర వహించారు. ఈ ఉద్యమాల సందర్బంగా ఆరంభమైన ఆయన జైలు శిక్షల జీవితం పది ఏండ్ల ఏడు మాసాల పాటు వివిధ జైళ్ళలో సాగింది.

1923లో డిలీలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశాలకు 35 సంవత్సరాల వయస్సులో అధ్యక్షత వహించిన మౌలానా 1927లో కాంగ్రెస్‌-ముస్లింలీగ్ ల మధ్య ఏర్పడిన సమోధ్యకు తోడ్పడ్డారు. 1939లో మరోసారి కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి చేపట్టి 1948లో స్వాతంత్య్రం లభించేంత వరకు ఆ పదవిలో ఉండి చరిత్ర సృష్టించిన ఆయన వేర్పాటువాదాన్ని వ్యతిరేకించారు. స్వతంత్ర భారతదేశంలో గాంధీజీ ఒత్తిడి మీద 1947 జనవరి 15న విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి, తొలి విద్యాశాఖామాత్యులుగా భవిష్యత్తు తరాలనుతీర్చిదిద్దే విలక్షణమైన విద్యా ప్రణాళికలను అమలుచేశారు.

మౌలానా పలు గ్రంథాలను రాసి ప్రచురించి మహకవిగా, పండితునిగా, అద్బుత మేథాశక్తిగల ధార్మికవేత్తగా ఎనలేని ఖ్యాతి నార్జించారు. జాతీయోద్యమం దిశగా ప్రజలను చెతన్యవంతుల్ని చేసేందుకు అల్‌ హిలాల్‌, అల్‌ బలాగ్ ఉర్దూ పత్రికలను వెలువరించారు. బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని కలవరపెట్టిన ఈ పత్రికలు పలుమార్లు నిషేదానికి గురయ్యాయి. భారత స్వాతంత్య్రోద్యమంలో, స్వతంత్ర భారత దేశంలో పలు విశిష్ట పాత్రలను నిర్వహించి, చరమాంకం వరకు తాను నమ్మిన లౌకిక ప్రజాస్వామ్య సిద్ధాంతాలకు కట్టుబడి, హిందూ-ముస్లింల మధ్య ఐక్యతను ప్రగాఢంగా వాంఛిస్తూ జీవితాన్ని సాగించిన మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ 1958 ఫిబ్రవరి 22న కన్నుమూశారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌