పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/137

ఈ పుట ఆమోదించబడ్డది

134

ఆకర్షితులయ్యారు. ఆయనను ఆకర్షించేందుకు అఖిల భారత ముస్లిం లీగ్ చేసిన పలు ప్రయ త్నాలు విఫలమయ్యాయి. మతత్వశక్తులతో చేతులు కలపడానికి నిరాకరించడంతో ఆయన ప్రబుత్వం కూలిపోయింది. ఆ తరువాత జరిగిన ఎన్నికలలో తిరిగి ఘన విజయం సాధించి సింధ్‌ ప్రధానిగా మరోకసారి అధికార పగ్గాలు చేప్టారు.

అది రుచించని మహమ్మద్‌ అలీ జిన్నా ఆయనను ముస్లింలీగ్ లో చేరమని పలుమార్లు స్వయంగా కోరారు. మతం ప్రాతిపదికన రాజకీయ పార్టీలు ఏర్పాటు చేయడం సుతరాము ఇష్టంలేని సుంరో మతాన్నిరాజకీయాలతో ముడిపెట్టడం ఇస్లాం సిద్ధాంతాలకు వ్యతిరేకమని ప్రకటించారు. ఈ సందర్భంగా మతోన్మాద రాజకీయాలను రెచ్చగొట్టి రాజ్యాధికారాన్ని నిలబెట్టుకోడానికి కుయుక్తులు పన్నుతున్న శక్తుల తీరు తెన్నులను అతి ఘాటైన పదజాలంతో విమర్శిస్తూ ఆయన రాసిన లేఖ భారతస్వాతంత్య్రోద్యమ సాహిత్య చరిత్రలో అతి విలువైన డాక్యుమెంటుగా పరిగణించబడింది. మతత్వభావాలకు అతీతంగా 1940 ఏప్రిల్‌ మాసంలో ఢిల్లీలో జరిగిన 'ఆజాద్‌ ముస్లింల సమావేశం' లో పాల్గొన్న ఆయన ముస్లింలీగ్ ప్రతిపాదించిన విభజన తీర్మానాన్ని గట్టిగా వ్యతిరేకించారు.

1942లో 'క్విట్ ఇండియా' ఉద్యమం ఆరంభం కాగా ప్రజలను అణిచివేసేందుకు పరాయిపాలకులు సృష్టిస్తున్న రక్తపాతం, అనుసరిస్తున్న క్రూరమైన చర్యలను ఆయన బహిరంగంగా నిరసించారు. జాతీయోద్యమంలో భాగంగా మహాత్మాగాంధీ సూచనల మేరకు అల్లా బక్ష్ ఖాదిని, ఖాది ఉత్పత్తిని, విక్రయాలను ప్రోత్సాహించేందుకు స్వయంగా సడుంకట్టారు. జాతీయోద్యమ కార్యక్రమాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళటం, ప్రభుత్వం గతంలో ఇచ్చిన బిరుదులను విసర్జించటం, అతిఘాటైన పదజాలంతో పాలక వర్గాల దుశ్చర్యలను విమర్శించడాన్ని ఆంగ్ల పాలకులకు మింగుడు పడలేదు. ఈ వైఖరి నచ్చని ముస్లింలీగ్ నేతలు ఆయన విమర్శను తట్టుకోలేక ఆగ్రహావేశాలు వ్యక్తం చేయ సాగారు. ఆ పరిస్థితు లలో రానున్న దుష్పరిణామాల పట్ల సన్నిహితులు హెచ్చరించినా ఆయన ఖాతరు చేయలేదు, ఆత్మరక్షణకు జాగ్రత్త చర్యలేవీ తీసుకోలేదు.

ఆ కారణంగా సన్నిహితులు భయపడినట్టే మేధోపరంగా ఆయనను ఎదుర్కొన లేకపోయిన అరాచక ఉన్మాదశక్తులు బౌతికచర్యలకు పాల్పడి 1943 మే 14 న సుంరోను కాల్పులకు గురిచేశాయి. ఈ ఘాతుక చర్యతో బ్రిటిష్‌ ఇండియాలో ప్రముఖ ప్రధానిగా ఖ్యాతిగడంచి, మతోన్మాద, వేర్పాటువాద రాజకీయ శక్తులతో చివరివరకు రాజీలేని పోరాటం సాగించి, విభజన ఆలోచనలను ఆదినుంచి వ్యతిరేకించిన అల్లా బక్ష్ సుంరో రాజకీయ చిత్రపటం నుండి ఆకస్మికంగా అంతర్థానమయ్యారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌