పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/129

ఈ పుట ఆమోదించబడ్డది

126

అభిప్రాయాలను కూడా ప్రభావితం చేసిన ప్రతిభావంతురాలు బేగం అన్సారి.

1921నాటి ఖిలాఫత్‌ ఉద్యమ కార్యక్రమాలలో పాల్గొనటం ద్వారా ఆమె జాతీయోద్యమంలో ప్రత్యక్షంగా ప్రవేశించి భర్తతోపాటుగా బహుముఖ పాత్ర నిర్వహించారు. ఢిల్లీ ఖిలాఫత్‌ కమిటీ మహిళా విభాగం అధ్యక్షురాలుగా ఉద్యమానికి, ఉద్యమకారుల కుటుంబాలకు ఆమె ఎనలేని సేవలందించారు. ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధులు, అలీ సోదరుల మాతృమూర్తి ఆబాదిబానో బేగం ఢిల్లీ వచ్చిన సందర్భంగా మహిళలతో ప్రత్యేక సమావేశాలను నిర్వహించి ఖిలాఫత్‌ ఉద్యమం కోసం వేలాది రూపాయల విరాళాలను వసూలు చేసి ఆమెకు అందాజేశారు.

భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశాల పట్ల కూడా ఆమె ప్రత్యేక ఆసక్తి చూపారు. భర్తతోపాటుగా ఆమె ప్రతి సమావేశానికి హాజరయ్యవారు. డాక్టర్‌ అన్సారి ప్రారంభించిన Anjuman-i-Khuddam-Kaaba కార్యకలాపాలలో కీలకపాత్ర పోషించారు. ఆదునిక విద్యావిధానాలు, సాంప్రదాయక విద్యాపద్ధతుల మధ్య సమన్వయం ఏర్పరచడానికి, మక్కాలోని పవిత్రస్థలాలను పరిరక్షించి అభివృద్ధి పర్చేందుకు సాగిన కృషిలో తోడ్పాటు అందించిన ఈ సంస్థకు ఆర్థిక వనరులు సమకూర్చడానికి, ఉద్యమకారుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోడానికి షంషున్నీసా బేగం ఎంతగానో శ్రమించారు.

జాతీయ కాంగ్రెస్‌ ఢిల్లీలో నిర్వహించిన జాతీయ స్థాయి కార్యక్రమాలు ఏవీకూడా ఆమె భాగస్వామ్యం, సహకారం, ఆతిధ్యం లేకుండా జరిగేవి కావు. ఈ సందర్భంగా అతిధులెవ్వరికీ ఎటువంటి అసౌకర్యంకలుగకుండాప్రణాళికాబద్దంగా ఆతిధ్యాన్ని, ఇతర సదుపాయాలను కల్పించటంలో ఆమె స్వయంగా శ్రద్ధవహించారు. ఆమె సేవాగుణం, సహకారం, కార్యదక్షతను ప్రస్తావిస్తూ 1931మార్చి 29నాటి నవజీవన్‌ పత్రికలో గాంధీజీ స్వయంగా ఒక ప్రత్యేక వ్యాసం రాస్తూ,అందులో ఆమె దానశీలతను వివరిస్తూ 'అన్సారి బేగం సమక్షాన శ్రద్ధాభావనలతో నా తలను వంచుతున్నాను' అని వ్యాసం ముగించారు.

1936లో డాక్టర్‌ ముక్తార్‌ అహమ్మద్‌ అన్సారి మరణించారు. భర్త మరణించినా ఆయన లేని లోటు కన్పించకుండా డాక్టర్‌ అన్సారి సమకూర్చిపెట్టిన సంపదను, తన అమూల్యమైన సమయాన్ని జాతీయోద్యమానికి అర్పితం చేశారు. ఆమెతో పరిచయ మున్న ప్రతి ఒక్కరిచే 'పవిత్రమైన..దానగుణశీల మహిళ గా ప్రశంసలందుకున్నారు. డాక్టర్‌ అన్సారి 'ఎంతటిఘనత సాధించినా అదంతా షంషున్నీసా అన్సారి సహకారంతో మాత్రమే ' నని ప్రముఖుల నుండి ప్రశంసలు, గౌరవాభిమానాలను అందుకున్నబేగం షంషున్నీసా అన్సారి 1938లో కాలధర్మం చెందారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌