పుట:చంద్రాలోకము.pdf/1

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చంద్రాలోకము

అడిదము సూరయ

క.

శ్రీరామచంద్రపురకే
ళీరసరసికాంతరంగలేఖర్షభకో
టీరమణిఘటితపదకా
ళీరమణీలోల రామలింగ మహేశా.

1


వ.

అవధరింపుము.

2


గీ.

బాలురకైననుఁ దెలియఁగా గాళిదాసు
మును రచించెఁ జంద్రాలోకమును, ద్రిలింగ
భాషఁ జేసితి నీ కృప భవ్యముగను
దీనిఁ గరుణించి కైకొమ్ము దేవదేవ.

3


క.

లలి నొండొరులతపంబుల
ఫలంబులై యమరియుండి ప్రాణులకెల్లం
దలిదండ్రులగుచుఁ దగు తొలి
యలదంపతుల నుతియింతు ననయము భక్తిన్.

4


క.

అమరీ కబరీభార
భ్రమరీ ముఖరీకృతంబు పరమోజ్జ్వలమౌ
హిమవత్తనయాశుభపద
కమలము దూరీకరిం చఘంబులు సతమున్.

5


క.

బాలురకు నలంకృతులన్
సౌలభ్యమునం బ్రవేశ సంసిద్ధిఁ దగున్
మూలమగు లక్ష్యలక్షణ
మాలాసంగ్రహ మనుక్రమంబునఁ జేతున్.

6

ఉపమాలంకారము

గీ.

వర్జ్య ముపమాన ముపమానవాచకము స
మానధర్మము సంఘటింపనగు నుపమ
హంసిచందాన నీకీర్తి యబ్జనాభ
యభ్రగంగావగాహనం బాచరించు.

7

లుప్తోపమ

గీ.

వర్ణ్య ముపమాన మౌపమ్యవాచకు స
మానధర్మంబు ననువానిలో నొకండు