పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/98

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

అన మది మట్టు పెట్టికొని యల్లన పయ్యెదఁ జేర్చి దీర్ఘలో
చనములఁ జాల [1]జాలుకొని జాఱెడు నశ్రులు గోర మీటుచున్
వినతముఖాబ్జయై మిగుల వ్రీలిన కొ ప్పొకకేలఁ జెక్కి చి
క్కనిసెగఁజల్లు నూరుపులు గ్రమ్మఁ బదాంగుళి నేల వ్రాయుచున్.

60


ఉ.

ఏమియొకో యెఱుంగఁ జెలి యే మును గేళివనంబులోనికై
యామనిసొంపుఁ [2]జూడఁ జనినప్పటినుండియు డెంద మాకులం
బై మననీని కాఁక కిర వయ్యె నటన్న నొకింత నవ్వుచుం
గోమలి యిప్డుగా మనసు కోరికి తెల్లమి యయ్యె నెంతయున్.

61


[3]చ.

అని చెలి వెండియుం బలుకు నంబుజనేత్ర వనంబులోన నీ
కనుఁగొనినట్టి యాకుసుమకాండసమానుఁడు వీరసేనునిం
బెనఁగొని యుండు నెచ్చెలి సుమీ యిది యేమి దురాపకృత్యమే
మనమున దీని కేల పలుమాఱును గుందెద వేను గల్గఁగన్.

62


చ.

వనిత తలంపులోని వలవంతఁ దొఱంగగదమ్మ యిప్పు డేఁ
జని మనవీరసేనుచెలి జన్మము వంశము నూరుఁ బేరు నె
ల్లను సవిశేషరీతిఁ బదిలంబుగ నారసి వత్తు నింక నీ
వనిపినఁ జాలు నంచుఁ గమలానన నూఱడఁ బల్క నత్తఱిన్.

63

సంధ్యాకాలవర్ణనము

క.

పగటిసెగ వదలి పడమరఁ, డిగియె న్రవిమండలము వడి న్రశ్ములు పై
నిగుడ నల విష్ణుపదమున, దిగదిగయని [4]వ్రేలు తూఁగుదీవియ వోలెన్.

64


చ.

ఇనుఁ డపరాద్రియం దొఱగ నేగెడిచోఁ బయిరాజు వచ్చుటల్
[5]గనుఁగొనుఁ డంచు నున్నతతలంబుల నంచులఁ గోపురంబుగా
నునిచినయట్టి యాత్మబలమో యన భూధరశృంగసీమలన్
వనతరుశాఖలం [6]దొగరువన్నియయెండలు నిల్చె నయ్యెడన్.

65


మ.

దినలక్ష్మీజనకాత్మజాపహరణోద్వేలస్థితిం బొల్చు న
స్తనగేంద్రక్షణదాచరేశ్వరుని భాస్వన్మౌళిబృందంబు నూ
తనతారావరకాలకీశపతి యౌద్ధత్యంబుచే నుర్లినం
గినుకం బర్వుతదక్షి[7]రాగములమాడ్కి న్మించె సంధ్యారుచుల్.

66
  1. క-జాలుకొనఁజాలెడు
  2. ట-జూడఁగాఁ జనినయప్పటి
  3. ట-లో నీపద్యమునకు మాఱుఁగా "అనిన" యని వచనము గలదు.
  4. చ-వ్రేలతూలదీవియ
  5. చ-తను గొనునంచు
  6. చ-ట-దొరఁగువన్నియు
  7. ట-రాగ మనుమాడ్కిన్