పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/97

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మన సెఱుంగని చెలియ నే మనఁగవచ్చుఁ, బిలిచె మఱికొంతతడ వందు నిలువనీక
యని తలంపఁగఁ జింతాలతాధిరూఢ, దర్పకదశాంకురమ్ములు దలముకొనియె.

53


చ.

తనువున నిండి కాలుకొను [1]తాపముసోఁకు సహింపలేక జీ
వన మతిశైత్యకాంక్ష నిజవాసము వెల్వడి కర్ణకూపశీ
లనసరసస్రఫుల్లకమలద్వితయంబున విశ్రమింప వే
గనటకు వచ్చెనో యనఁగఁ గన్నులఁ బ్రాణము నిల్చె [2]లేమకున్.

54


శా.

ఆలజ్ఞావతి [3]నంత నొక్కచెలి డాయ న్వచ్చి యాశ్చర్యదో
లాలీలాలసచిత్తయై యకట యేలా వచ్చె నీ[4]వంత యీ
నాళీకాయతనేత్ర కంచు మదిఁ జింతం జెంది తద్దీనదీ
నాలాపంబులచే లతాంతశరబాహాప్రౌఢి నూహించుచున్.

55


చ.

అలకలు గూడదిద్ది సరు లల్లన చిక్కెడలించి జాలుగా
నొలికెడు బాష్పము ల్దుడిచి యొయ్యనఁ బయ్యెదకొంగుఁ జేర్చి సొ
మ్ములు సవరించి ఘర్మజలము ల్దొలఁగం దడియొత్తి యెత్తి తొ
య్యలి నెదఁ జేర్చి చేర్చి కరుణాకులగద్గదనిస్వనంబునన్.

56


చ.

చెలియ యిదేమి నేఁడు గడుఁజిత్రము నీదుతెఱంగుఁ జూచినం
దలఁపఁగరాని బెట్టిదపుఁదాపము రూపము వింతకోపమున్
నెలకొనినట్లు తోఁచె నిది నిక్కము దక్కులు పల్కనేల నీ
కలకకు నొండు కారణముఁ గానముగా మదిఁ జింత సేసినన్.

57


సీ.

దగరతేఁటులకప్పు పగఱనీటులఁ గప్పు వలుదపెన్నెఱికొప్పు వదలె నేల.
మెఱపునక్కులఁ జిక్కువఱపు టెక్కులనిక్కు లలఁతినిద్దపుఁజెక్కు లడలె నేల
చలువ[5]చాయలఁజేర్పు కలువపూవులనేర్పుఁ దెగడు కమ్మనియూర్పు దెరలె నేల
పసిమితీవలమించు [6]మిసిమిలేవలమించు వలపుమైఁ గ్రొమ్మించు వాడె నేల
మొగడతమ్ముల జిగినేలి పొగడఁజాలి, నిగుడుచన్నులఁ జెమటలు నిండె నేల
తళుకు బేడిసకవచాయఁ దళుకుఁ జేయ, నేర్చుకన్నులఁ గెంజాయ నిలిచె నేల.

58


ఉ.

గో మగునీమొగంబు గనుఁగొన్నను గ్రొన్ననవింటిదంటచే
బాములు నోమినట్లు గనుపట్టెడు నిట్టియెడ న్మఱుంగు లిం
కేమిటికే మిటారి తలఁ పెల్లను చెల్లమి గాఁగఁ దెల్పవే
యామకరాంకు నైనను జయంతుని నైనను దెత్తు నిత్తఱిన్.

59
  1. చ-తాపము సైఁపఁగ లేక యంత
  2. ట-నొయ్యనన్.
  3. ట-నొక్కనాఁడు
  4. చ-ట-చింత
  5. చ-పూవుల, ట-తావుల
  6. క-ట-నుసిమి